ఓటు బ్యాంకు
ఓటు బ్యాంకు
దొంగలెవరో దొరలుఎవరో..తేల్చుకుంటే కొంతమేలు..!
సంపదంతా కలిసిచక్కగ..పంచుకుంటే కొంతమేలు..!
ప్రజలసంగతి దేవుడెరుగును..ఎందుకొచ్చిన సంక్షేమం..
ఓటుబాంకును చెక్కుచెదరక..కాచుకుంటే కొంతమేలు..!
నేతమాటలు నీటిమూటలు..ఎంతనిజమో నమ్ముకోవోయ్..
కళ్ళుమూసుకు నోరుతెఱుచుకు..పండుకుంటే కొంతమేలు..!
ఎవరుఎట్లా పోతెఏమిటి..సొంతలాభం మరువకోయి..
నలుపుతెలుపుల ముచ్చటేదో..తెలుసుకుంటే కొంతమేలు..!
వెలుతురైనా చీకటైనా..ఒక్కటేగా దోచుకొనగ..
అడ్డుఆపులు లేపువిద్యను..నేర్చుకుంటే కొంతమేలు..!
దురాక్రమణయె రాజనీతిగ..చెల్లురోజులు చెల్లునెపుడు..
విశ్వశాంతిని కాస్తశ్వాసగ..తీసుకుంటే కొంతమేలు..!
