ఓం మనిషి ఎక్కడున్నావు
ఓం మనిషి ఎక్కడున్నావు
ఓ మనిషి... అసలు నువ్వు ఎక్కడున్నావు?
రంగుల ముసుగుల వెనుక ఎక్కడో దాక్కున్నావు!
అంతస్తుల అహంకారంలో, అధికారపు వేటలో...
నీలోని 'మనిషి'ని నువ్వే చంపుకుంటున్నావు!
ఓ మనిషి... అసలు ఎక్కడున్నావు?
డబ్బుల వేటలో పరిగెడుతూ... బంధాలను మరిచావు,
పక్కవాడు ఆకలితో ఉంటే... మొహం చాటేస్తున్నావు.
కుళ్లు, కుతంత్రాల సందుల్లో నక్కి,
పగటి వేషాల బతుకును మోస్తున్నావు.
ఇదేనా నువ్వు పుట్టినందుకు చేస్తున్న జీవన పోరాటం?
నీ ఆత్మను అమ్ముకునే ఈ బతుకు... నిజంగా ఒక జీవితమా?
మతం పేరుతో గోడలు కట్టావు, కులం పేరుతో కత్తులు దూశావు,
"నేను హిందువుని, ముస్లింని, క్రిస్టియన్‌ని" అంటూ రొమ్ము విరిచావు.
కానీ... గుండెల నిండా మానవత్వం ఉన్న "మనిషిని" అని చెప్పడానికి,
నోరు పెగలక ఎందుకు అలా మౌనంగా ఉండిపోయావు?
సరిహద్దుల గీతల్లో నీ స్వేచ్ఛను బందీ చేశావు!
నీ ఆకలి తీర్చే ప్రకృతికి ఏ కులముందని అడగవు,
నీ ఊపిరి నిలిపే గాలికి ఏ మతముందని అడగవు.
నువ్వు తొక్కే భూమాతకు లేని కులాల బేధాలు,
మట్టిలోకి పోయే నీకెందుకు ఈ కటిక ద్వేషాలు?
చివరకు నువ్వు బూడిదయ్యే స్మశానానికి
ఏ వర్ణముందని వెతుకుతావు?
నువ్వు కట్టుకున్న సామ్రాజ్యాలన్నీ ఇక్కడే కలిసిపోతాయి,
నువ్వు దాచుకున్న కాసులన్నీ ఇక్కడే మిగిలిపోతాయి.
వెళ్లేటప్పుడు నీతో వచ్చేది నీవు పంచిన ప్రేమే కదా!
ఇప్పటికైనా మేల్కో... నీలోని మమకారాన్ని వెతుక్కో!
ఓ మనిషి... ఇకనైనా నీ మనసు వైపు అడుగులేయ్!
