ఒంటరి సముద్రం
ఒంటరి సముద్రం
నేనెప్పుడూ ఒంటరిగా ఉండని
పారవశ్య సముద్రం తను..
ఆ సముద్రాన నేనిపుడు
దారి తప్పిన దాహపు చుక్కను
శీతాకాలపు రాత్రిలా...
చుట్టూ ప్రవహిస్తున్న కాలం చెక్కిలి పై
చెరగని కన్నీటి చారికలా అటు తను..
ఊపిరి తీగ
తెగినంత ఒంటరితనంతో ఇటు నేను..
శరదృతువు ఆకులాగా,
తన పాదాల వద్ద రాలిపడుతున్నాను..
క్షీణిస్తున్న రోజుల్ని వింటూ
సగం తెగిన చెట్టునైపోయాను
ఏ విషాద వాద్యనాదాన్నో ఆవాహన చేసుకున్న
తన పాదధ్వనిని
కొంచెం కొంచెం పాడుతుంటే
ఋతువులన్నీ
నాలో ఖాళీ అవుతున్నట్టుంది..
ఎన్ని సముద్రాల గుమ్మరింతో అది
తనువెల్లా ఓ దుఃఖవాగైనట్టుంది
