ఒక గీతం
ఒక గీతం
మధుర గీతానివి నువ్వు! ఓ పట్టాన అర్ధమే కావు,
మెహదీ హసన్ గజల్లాగ! తెల్లారు మంచు పొగలో
ఎగిరే పిట్ట- కన్ను చిదుముకున్నా కనిపించవు, విపిస్తావు!
నీరెండన మెరిసే చినుకు- ఎడారి మేను తడిపెయ్యవు, ఉడికిస్తావు!
ఐనా... గోధూళి వేళ గుండె తెర పై ఒక ఇంద్ర చాపాన్ని విడిచి పోతావు!
అందమైన ఒర, కరుకైన కత్తి- నరికెయ్యవు, నరకంలోంచి తోసేస్తావు
ఒక మబ్బు తునక- మెరుపై వస్తావు, కానీ ఉరిమి భయ పెడతావు!
ఒక చల్లని గాలి తెమ్మెర- అల్లనల్లన వీచి జీవితేచ్ఛను ఎగసనదోస్తావు,
ఐనా అంతలోనే ఎటో కనిపించక పోతావు! తెలతెల్లని మల్లెపూవు-
మనసు గదిలో తియ్యని పరిమళాన్ని పరిచి మరు నిమిషం కరిగిపోతావు!
అరుదైన పక్షీ! కనిపించీ కనిపించక కనువిందు చేస్తావు, రెక్కలు చాచి
రివురివ్వున మనోలోకాల్లో విహరిస్తూ విశ్రాంతి సంగతే మర్చిపోతావు!
దిగులు పురుగు గుండెను తొలుస్తున్నపుడు చల్లని చిరునవ్వై వచ్చి
సేదదీరుస్తావు నీ అడుగుల సవ్వడి విని వేచి చూస్తున్నపుడు,
పాటల పూదోటలో మైమరచి ఆడుకుంటూ- తుమ్మెద రెక్కలపై వినిపించే
తియ్యని రాగమై మూర్ఛనలు పోతావు!
ఓహ్! సంగీతం నీ దేహం స్వేచ్ఛ నీ హృదయం ఎందుకు దూరావీ
గూటిలోకి? నీ రంగస్థలి కదా ఆ గగనం!!!

