నవ జీవితం
నవ జీవితం
కనులుకనులు మాటలాడ..శుభపత్రిక వ్రాసినట్లె..!
ఇరుమనసులు ఏకమైన..కల్యాణం జరిగినట్లె..!
మూడుముళ్ళ బంధానికి..వ్యాఖ్యానం కావాలా..
మనసా వాచా కర్మణ..బ్రతుకుదారి కుదిరినట్లె..!
అగ్నిచుట్టు ఏడడుగులు..నడుచుటన్న అర్థమేమి..
నవజీవన సాంగత్యపు..పరమార్థము పొందినట్లె..!
వేదమంత్ర శాసనాలు..ఎంతమౌన బోధసేయు..
మాటమంత్రమయే గొప్ప..ప్రకంపనలు అందినట్లె..!
చందనాలు మల్లియలు పాలు మిఠాయీలందుకో..
అనుభవాల పందిరిలో..గంధాలవి పండినట్లె..!
ఇరుతనువుల కలయికలో..విరబూసే కలలెన్నో..
ఏకత్వపు వెన్నెలలో..స్వర్గపురుచి దొరికినట్లె..!
