గురుపూజ
గురుపూజ
*గురుపూజ*
(కందములు)
గురువే దైవమటంచును
బరమాత్ముడు దా కొలిచెను భక్తియుతుండై
పరమును జూపెడి గురునికి
మరిమరి నే ప్రణతు లిడుదు మక్కువతోడన్/
తప్పులు దిద్దెడి యొజ్జను
మెప్పుదలగ జూచి మనలఁ మెచ్చిన గురునిన్
ముప్పును తప్పించు గురుని
కెప్పుడు మ్రొక్కద వినతిగ నీశ్వరుడంచున్.//
భారతిసతి సేవకుడై
మారాతలు మార్చుచుండు మహనీయుడిలన్
గారణ జన్ముడు మమ్ముల
తీరిచి దిద్దెడి యనఘుని తిరముగ దల్తున్.//
పదములు నేర్పెడి గురువై
వదలక మా వెంట పడుచు వ్యాకరణంబున్
మదిలో చొప్పించు నెపుడు
ముదముగ గొల్తును సతతము పుణ్యచరిత్రున్.//
గురుపూజోత్సవ దినమున
గురుతుగ పద్యముల నల్లి కొల్చుచు పదముల్
స్థిరముగ సేవించ గురుని
వరములు గుప్పించి వాణి వాంఛలు తీర్చున్.//
