సంసార సౌధం
సంసార సౌధం
*సంసార సౌధం*(కవిత )
****************************
ఓ ప్రియా!నీ మీద ప్రేమ
కనులలోని చెమరింపులో వుంది
మనసు మూలల్లో దాక్కుని వుంది
బయట పడలేని బందీలా వుంది
బాధతో ముకుళించుకు పోయింది
మనమధ్య ఎన్నెన్ని తెరలు
కనుపించని అగాధాలు
ఈ రోజు తెరిచా మదిలోని యరలు
గుప్పున ఎగిసి పడ్డాయి ప్రేమ పరిమళాలు
నాలోని భావమొక గీతికై ప్రభవించింది
నా నిశ్శబ్ద గానం నీకు వినిపిస్తోందా ప్రియా!
నా హృదయమొక విపంచిలా
నీ దగ్గర వాలిపోయింది
నీ గుండె గూటిలో నిశ్చింతగా నిదురించాలని వుంది
అభిమానమో!అహంకారమో!
నిన్ను నన్ను దూరం చేసింది
అలకో, కోపమో అధిష్టానమయ్యింది
అనురాగ మెక్కడో అదృశ్య మయ్యింది
వెతికి పట్టుకొందాము ప్రియా!
మన వివాహపు తొలినాళ్ళని
బాధ్యతల మధ్య కృశించిన ప్రేమ బంధానికి
జీవం పోద్దామా!
కాలాన్ని కలల్ని వెనక్కు తెచ్చుకుందామా!
మన సంసార సౌధాన్ని
కూలి పోనీయక నిల్పు కొందామా!
************************
