నూతన వత్సరమా
నూతన వత్సరమా
నూతన వత్సరమా!
(వచన కవిత)
నూతన వత్సరమా!ఈ యుగంలో లోకాన్ని రక్షించు!
నీతినియమాలను నేటి తరముకు శ్రద్ధగ నేర్పించు!
యుద్ధోన్మాదముతో నుర్వి తగలబడుతోంది చూడు!
ఉద్దరింపుచు నీ జగతికి నూపి రందీయగా రావమ్మా!
పక్షిగణము లెందుకో పలకరింపుకు రాలేదేమి టిప్పుడు.
రక్షనిడు చెట్లు లేని సీమకు రాలేమని చెబుతున్నాయి.
కోయిలమ్మల కూత లెచ్చటో? కుహు కుహు రాగాలేవి?
మోయలేని భారంతో ముసుగేసి పడుకున్నాయెచ్చటో!
ఉరుకుల పరుగుల జీవితాల్లో వసంత మెక్కడుందయ్యో!
కరవు కాటకాల్లో కాలి బూడిదయి కనిపించలేదక్కటా!
క్రొత్త యుగాదికై ప్రజలెల్ల రాశతో నెదురు చూస్తున్నారు.
సత్తువ నిడమని సామూహికంగా ప్రార్థనలు చేస్తున్నారు.
శుభములు పొంగించు శుద్ధ సత్య స్వరూప మీవే కదమ్మా!
అభయ ప్రదాతవై జనులకు నానందాన్ని పంచగ రావమ్మా!
ప్రాత వత్సరపు గాయాలను మరచి పోతామంటున్నారు.
జాతి కంతటికి నీవు చైతన్య మందించు దేవత వంటున్నారు.
పర్వదినమా!ప్రకృతిని కాపాడుకొంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
సర్వ జీవుల శ్రేయస్సు కొఱకు త్యాగాలను చేస్తామంటున్నారు.
వెలుగులు నింపెడి యుషోదయాలను తెచ్చి పెట్టమన్నారు.
కలిసి మెలసి ఓ యుగాదీ!నిను స్వాగతిస్తూ వేచి యున్నారు.//
