నిప్పు కప్పిన బూడిదే
నిప్పు కప్పిన బూడిదే
నిప్పు కప్పిన బూడిదే కనిపిస్తుంటే..
నిప్పు కప్పిన బూడిదే కనిపిస్తుంటే
పాదముద్రల మరకలతో నడుస్తుంది
తెగిన దేహం కలహాలతో కదులుతుంటే
కత్తులతో పన్నుల రూపంలో వసూల్లు జరుగుతుంది..
అజీర్ణ సమస్య నిత్యం వేధిస్తుంది
జీర్ణము కాని ఉదరంలో నిప్పులు రగులుతూ
ఆకలి జిహ్వ రుచిని వేరు చేస్తుంటే
ఆకారం కనిపిస్తే చాలు ఆరగిస్తుంది..
పురాతన ఎద్దుల బండిలా బ్రతుకులు
రాకెట్ యుగములో నడవలేక పోతుంటే
మట్టి పులిమిన రంగు దేహములో
విత్తనాల కోలాహలం కనిపిస్తూనే ఉంది..
ఆశలు అరణ్య రోదనల్లా వినిపిస్తుంటే
బక్క చిక్కిన ప్రాణికి భరోసా కనబడలేదు
నవరసాల కౌగిలిలో సేద తీరలేక
అక్షరపు నేలపై పొర్లు దండాలు పెడుతున్నాయి..
ఏడుపుగొట్టు నదులు నేలపై నడుస్తూ
తన కన్నీటి శోకముతో శుభ్రం చేసుకుంటూ
దాహము తీరక ఆకాశాన్ని అప్పు అడుగుతూ
నేలను పచ్చని వర్ణముతో సింగారిస్తున్నాయి..
అశ్రునయనాలతో సముద్రం ఎంత ఏడ్చినా
రాకాసి అలలు ముందుకు సాగుతూనే ఉన్నాయి
ఆలోచనలు ఎంత ఎగిసి నేలకు తాకినా
వాస్తవాల విస్తరణలో హద్దులు పెరగడం లేదు...

