గుండె గుడిలో జ్ఞాపకాలు
గుండె గుడిలో జ్ఞాపకాలు
కాలం వేగంతో పరుగులు తీసాక
కనురెప్పలు తలుపులు మూయలేక వదలని
జ్ఞాపకాల తుట్ట కదులుతూ ఈ పొద్దు ఎందుకో
గుండె మారం చేస్తున్నది —
బాధలన్నీ బంధించుకుని కన్నుల నీటిలో దాచేసినా
ఎన్నో జ్ఞాపకాలు రాలే పూలలా నేల కొరిగినా
వసంతం ముగిసిందో మనసు విరిగిందో కానీ
ఇవాళ నాలో ఎందుకో జ్ఞాపకాల చెట్టు నుండి
ఒక్కొక్కటి పదునుగా గుండెనుతాకుతున్నాయి
ఓనాడు గుండె కొమ్మకు ఊగిన పువ్వులు
ఒక్క గాలి వాటుకు చెల్లాచెదురైనాయి నేల రాలిన
ఆ పువ్వుల్లో ఎన్నెన్ని కధలు దాగున్నాయో!
ఇప్పుడు నవ్వుల సరాగాలు లేవు, నేల రాలి
చెదిరిన జ్ఞాపకాలు చెల్లా చెదురైనాయి,
కనపడని సహజమైన ఈ ఋణాను బంధాలు
మనసున్నంత వరకుఋ ఒక్కక్కటిగా మనసును
తాకుతూనే ఉంటాయి
దారి విడిచిన మనిషిని ఈ జ్ఞాపకాల చెట్టు నీడలోకి
తీసుకువెళితే ,మదిని కప్పేసిన ఎన్నో అడ్డు తెరలను
తొలగించుకుంటే, పచ్చని జ్ఞాపకాలు వెలిసిపోయిన
వర్ణాలు సజీవమౌతాయి; ఆశలెన్నో జన్మకర్థం చూపుతాయి,
అప్పుడు కాలం చెట్టుకి సరికొత్త చిగురులు తొడిగి
ఆశల పూలు విరబూస్తాయి
