నిజమే
నిజమే
నిజమే...
మన మధ్య నిశ్శబ్ద యుద్ధం సాగుతోంది...
మరి కాకపోతే ఏంటి...!?
వస్తావు చూసీ చూడనట్లు నను చూస్తావు...
పలకరించబోతే పలుకులే బంగారమంటావు...!
ఇంటి ముంగిట సిరి మువ్వలతో...
నడయాడుతుంటావు...
అడుగులో అడుగు కలిపే లోపు...
గోరింకలా తుర్రుమంటావు...!
గాజుల గలగలలు వినిపిస్తావు...
నను పిలుస్తున్నావనుకుని...
దరి చేరే లోపు ధ్యాసనే మరలిస్తావు...!
సుగంధ పరిమళాలతో నడయాడుతుంటావు....
నా లోగిలిలో అడుగిడుతున్నావకునే లోపు...
దారి తప్పించుకుని ఆట పట్టిస్తావు...!
ఎదలో కొలువుంటావు...
నా సర్వం నీవే అనుకునే లోపు...
గగన కుసుమం నేనంటావు....!
పోనీలే...
నిను మరచి నా పయనం సాగిద్దామనుకుంటే...
లేదు నీ దినచర్య నాతోనేనంటూ...
తూరుపు కిరణానివై పలకరిస్తావు...!
చివరికి మిగిలావు...
వదలిపోని వ్యసనానివై....
తనివి తీరని ఇష్టానివై....!
ఆశగా చూసే నన్ను....
తప్పదు మన మధ్య ఈ నిశ్శబ్ద యుద్ధం...
గత జన్మల ఋణాలబంధం తీరేటంతవరకు...
అని చెప్పకనే చెప్పేస్తూ....
నీ ఆగర్బ శత్రువు నేనేనంటూ నిరూపిస్తున్నావు...!
