నీలిమేఘమాల
నీలిమేఘమాల
వెళితివేల చేయివిడిచి..వలపుకెంత కష్టమాయె..!
చెప్పాలని తలచలేను..మనసుకెంత భారమాయె..!
చల్లగాలి వీస్తున్నా..ఎదలోయల జ్వాలలేవొ..
ఓపలేని వేదనతో..తనువుకెంత తాపమాయె..!
మాట ఒకటి చెప్పాలను..ఆరాటం ఎంతంటే..
చెప్పలేని తనముతోటి..పలుకుకెంత రోషమాయె..!
ఎవరితోటి పోరాటమొ..ఎందుకొఱకు ఆరాటమొ..
ఆశపెట్టు అల్లరితో..ముద్దుకెంత మోసమాయె..!
నన్ను నేను చెక్కుకోగ..చూసుకోను ఏమిటసలు..
నిలువలేని నీడతోటి..తలపుకెంత బంధమాయె..!
అంబరాలు దిగిరావని..నేలకెలా చెప్పవలెను..
నీలిమేఘ మాలలోని..చినుకుకెంత మోసమాయె..!

