నీకు రాసివ్వాలనే ఉంది
నీకు రాసివ్వాలనే ఉంది
గుండె గుండెకు మధ్య
విధి వింతగా ప్రవర్తించినప్పుడల్లా
వెదికి వెదికి వజ్రాన్ని సంపాదించినట్లు
ఆ పిలుపు ప్రకంపనల ద్వారా
నీ హృదయంలో దాక్కోవాలనే ఉంది
నిస్వార్ధంగా...నిజంగా ఉండాలే గాని
తాకి చూడలేని తారల్ని సైతం
తాయిలంలా నీకు పంపాలనే ఉంది
ప్రతిక్షణం పంచే నీ అనురాగంలో
రాగాన్ని నేనై ఉండాలే కానీ
నీ స్పర్శను అంతరాత్మలో భద్రపరుచుకోవాలనే ఉంది
నీ నిత్య నామ స్మరణలో
నా నామం ఒక్క క్షణమైనా వినిపించాలే కానీ
శాశ్వతంగా నీ చిరునవ్వుల చిరునామానైపోవాలని ఉంది
కదులుతున్న ఈ నిరంతర పోరాటంలో
నీకు నేను నాకు నీవు అనిపించాలే కానీ
నీ అడుగుల సవ్వడిని అందరికి వినిపించాలనే ఉంది
కారణం ఏదైనా కానీ
కనుచూపు మేరలో నువ్వు కనబడాలే కానీ
కలవపువ్వునై నిత్యం నిన్ను కొలవాలనే ఉంది
ఈ అనంత విశ్వంలో
ఉన్న ఎన్నో బ్రమ్హాండాలలో
అణువైనా నాకోసం నువ్వు వెదుక్కోవాలే కానీ
హృదయాకారంలో నిన్ను వెంబడించాలనే ఉంది
లక్షల వేల క్షణాల కాలంలో
ఏ కొద్దీ కాలమైనా నువ్వు నాకై నిరీక్షించాలే కానీ
నా జీవితాన్ని నీకు పూర్తిగా రాసివ్వాలనే ఉంది

