నీ మాటలు
నీ మాటలు
బాంబులనే పూవులుగా..మార్చాలోయ్ నీ మాటలు..!
ప్రతిమనసును ప్రేమనదిగ..మలచాలోయ్ నీ మాటలు..!
తోటలెన్నొ పెంచవచ్చు..పుడమితల్లి శాంతికోరి..
జాజిమల్లె వంతెనలా..తోచాలోయ్ నీ మాటలు..!
కావ్యరచన సలుపవచ్చు..ప్రతిభా పాటవాలతో..
మంచుతేనె సెలయేళ్ళై..దూకాలోయ్ నీ మాటలు..!
బాటలెన్నొ వేయవచ్చు..నిజసేవా భావనతో..
చెలిమిపూల తివాచీలు..పరచాలోయ్ నీ మాటలు..!
దానమెంతొ చేయవచ్చు..ధర్మం ధరలో నిలుపగ..
మౌనసుధా మాధురినే..పంచాలోయ్ నీ మాటలు..!
సహనమెంతొ ఉండవచ్చు..నిదానమది తోడుకాగ..
మాయా నాటక సాక్షిగ..నిలపాలోయ్ నీ మాటలు..!
