నీ హృదినే
నీ హృదినే
ఆశకాని ఆశ అనెను..నీహృదినే చేరాలని..!
మాటలాడు మౌనమనెను..నాతోనే ఉండాలని..!
అసలెలాగ పట్టగలను..నీపాటగ బ్రతుకుతీరు..
తలపుమాటు జాబిలనెను..ఈ మధువే గ్రోలాలని..!
సముద్రాన్ని ప్రేమించే..నదుల కథలు వ్రాయుటెలా..
తేనెపట్టు నేత్రమనెను..హృదయంతో చదవాలని..!
గాలికబురు నీరుగార్చు..గుండెదిగులు తీరునెలా..
మెఱుపుతేనె గంధమనెను..బంధాలే రాలాలని..!
ఒక్కకంటి చుక్కలోన..పొంగుతున్న వ్యథలుతెలిసి..
చెలిచెక్కిలి నవ్వు అనెను..ఒకసాక్షిగ మిగలాలని..!
పుడమిశ్వాస వీణియలో..ఎన్ని తీపి రాగాలో..
మేలుకొల్పు కిరణమనెను..ఎఱుకపట్టు చిక్కాలని..!
