మిగిలిన భావం
మిగిలిన భావం
ఆలోచనల కందిరీగలు ముసురుతుంటే
మనసు గాలి గాలిగా గందరగోళంగా
స్థిరత్వం లేక అటు ఇటు పొర్లడం
ఒక్క పని పూర్తి కాదు
దగ్గరకు రావడానికే భయపడుతుంది నిద్ర చివరకు
అసలు భావం అలాగే మిగిలిపోతుంది
ఏకాంతం సాలెగూడులో ఇరుక్కున్న వారిని
మనవడు పలకరించి ఆటలోకి లాగితేనో
స్నేహితుడు మాటా మంచి లోకం విప్పితేనో
సహచరి పిలిచి దారి మారుస్తేనో
మనవరాలు ముద్దుల్లో ముంచితేనో
పుస్తకం దారి చూపిస్తేనో
గందరగోళం నుంచి గట్టెక్కుతాం
చేరాల్సిన గమ్యంలో మొదలవుతుంది పయనం
గుండెలపై బండ బాధ బరువు దిగుతది
అలాగే మిగిలిన భావం పూర్తి చేయడానికి
కొట్టివేతలతోనైనా కలం ముందుకు సాగుతది
కొన్నిసార్లు అంతా జ్ఞాపకమున్నట్లే ఉంటది
యాళ్లకు పదమో, పేరో తట్టదు
బుర్ర గోక్కుంటాం, జ్ఞాపకాల చెరువులో ఈదుతాం
చెట్టంత మనిషి గుర్తుపట్టావా అంటే.. ఆ అంటాం
పేరు చెప్పమంటే గ్యాప్ పెరిగిందంటాం
ఎదుటివారే విప్పుకోవాలి ముడులన్నీ
వృద్ధాప్యం ముల్లె ఎత్తుకున్న కొద్దీ
యాదులకు మొదలవుతుంది పరీక్ష
పునఃశ్చరణ తరగతులకు మనలో మనమే
మిగిలిన భావాలు అలాగే ఉండిపోతాయని కాదు
ఆలోచన కొనసాగితే తట్టొచ్చు పరిష్కారం
