నేస్తమా ఎవరు
నేస్తమా ఎవరు
నీ మనస్సు గాక నీకు..అద్దమంటి నేస్తమెవరు..!
ప్రతిప్రశ్నకు జవాబిచ్చు..మౌనమంటి నేస్తమెవరు..!
నిజప్రేమకు ఖైదుగాక..శాంతమింత దక్కదోయి..
బాధలనది దాటించగ..సహనమంటి నేస్తమెవరు..!
పాడలేక పాడుతున్న..కోకిలలా ఎందుకటా..
గుండెలోనె నలుగుతున్న..రాగమంటి నేస్తమెవరు..!
కంటివెనుక మరుగుతున్న..కడలులేల ఆవిరగును..
చినుకుపూల తేఱుసాక్షి..గగనమంటి నేస్తమెవరు..!
భావనలకు అక్షరాల..రూపమిచ్చు సందడి సరె..
చేయిపట్టి వ్రాయించే..శాంతమంటి నేస్తమెవరు..!
తోడుకొఱకు పరితపించు..పనేమిటో ఏంచెప్పను..
సంపదెంత నీకున్నా..ప్రాణమంటి నేస్తమెవరు..!
