నాలుగు దిక్కులా
నాలుగు దిక్కులా
పదం పదం కలుపుకొని సాగుతూ
వాక్యాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న
నలు దిక్కుల గర్జనలు వింటూ
నాలో నేను విస్పోటనం చెందుతున్నాను..
ఖగోళంలో భూలోకం నా స్థానం
విశాలమైన నేల కాగితంపై చిత్రాల్ని నిర్మించి
సముద్రపు నీటి సిరాతో వర్ణాల్ని సృష్టించి
గొప్ప గ్రంథాలను రాసే ప్రయత్నం చేస్తా..
ఆనందపు కన్నీటి చుక్కల్ని ఏరుకుంటూ
ప్రపంచపు అంచుల మీద శాంతి నివాసం చేస్తూ
తెల్ల కపోతాలకు శాంతి పర్వం బోధిస్తూ
ఎర్రటి నేలపై బంగారపు పూత పూస్తాను..
నిరంతరం సాగిపోయే కాలం ప్రవాహంలో
ధైర్యం అనే పడవల్లో నిరంతరం తిరుగుతూ
జీవితపు గట్టు సునాయాసంగా చేరేందుకు
అలల మధ్య ఎగిసిపడుతూ సాగుతున్నాను..
ఏళ్ళ చరిత్రలో రక్తపు మరకలు తొలగించేందుకు
ఎన్ని జెండాలు దేశాల నెత్తిపై ఎగురుతున్న
మానవత్వపు సువాసనలు వ్యాపించడం లేదు
బంగారపు పంటలో కలుపు మొక్కలు చూస్తున్నా..
ఏదేమైనా నిరంతరం రగులుతూనే ఉంది మనసు
ఆవేశపు వేడిని కన్నీళ్లు చల్ల పరచడం లేదు
కలతల కొలనులో రాళ్ల దెబ్బలే తగులుతుంటే
మనశ్శాంతికి మౌనమే మార్గంగా సాగుతున్నా...
