నాకు
నాకు
"నీ చూపుల దారులలో నడవాలని ఉంది నాకు
వెలుగుపూలు ఒకటొకటీ ఏరాలని ఉంది నాకు"!
ప్రవహించే జ్ఞాపకాలు గిలిగింతలు పెడుతున్నవి..
ప్రేమ మధుర తీరాలను ఏలాలని ఉంది నాకు..!
.
కలువ కనుల చెలియ కలల వీధులలో ఉన్నానట..
ఆ పదముల ఓ నదిలా దూకాలని ఉంది నాకు..!
ఎద కడలిని రేగు అలల కవ్వింతలు చిత్రములే..
నీ తలపుల వేదికగా కావాలని ఉంది నాకు.!
ఈ క్షణాల పెదవులపై మౌన వేణువయ్యానే..
నీ వలపుల సీమలో మునగాలని ఉంది నాకు..!
ఈ సిమెంటు అడవుల్లో తడి కోసం చూస్తున్నా..
నీటి చుక్క ఆవేదన తెలపాలని ఉంది నాకు..!
మోసాలు.. ద్వేషాలు..అరాచకాలు ఎన్నెన్నో..?
పైసాకై పరుగులన్ని ఆపాలని ఉంది నాకు..!
రాజకీయ చదరంగం పావులన్నిపాములేన..?!
సమ సమాజ నిర్మాణం చేయాలని ఉంది నాకు..!
సమ భావం..నిజ స్నేహం అణువణువున కాంక్షిద్దాం..!
విశ్వ మతం..'ప్రేమి'కులం నిలపాలని ఉంది నాకు..!
మేఘ రథం పిలుపులు విని మెరుపల్లే అయ్యావే..!
చిగురాకుల పెదవులనే తడపాలని ఉంది నాకు..!
పరిమళించు గాలులతో ఊసులెన్ని చెబుతున్నా..
చెలియ మానస వీణియనే మీటాలని ఉంది నాకు..!
ప్రాణ వీణ తనువైతే అనురాగం నీవు కదా..!
నీ పెదవుల మధు ధారగ సాగాలని ఉంది నాకు..!
కను రెప్పల పెదవులపై కాటుకేమి చెబుతుందో..!
నీ తలపుల చిత్రాలను చూడాలని ఉంది నాకు..!
ప్రశ్న మాటు జవాబుగా దాగున్నది నీవేగా..
నీ అల్లరి సరస్సులో మునగాలని ఉంది నాకు..!
ఆ చుక్కల వీధులలో కాంతి సిరుల రాశి నీవె..
నీ చూపుల వెన్నెలలో ఆడాలని ఉంది నాకు..!
ఆరిపోని నీ వెలుగుల లీలలెంత అద్భుతమో..!
ఒక్కసారి చూసి తెలిసి చాటాలని ఉంది నాకు..!
నా పలుకుల కలకండకు మౌన సరస నిధివి నీవు..
నీ స్వరాల వసంతమే పంచాలని ఉంది నాకు..!
అష్టపదుల ఇష్టపదులు జావళీలు నీ కొరకే..
నీ పదముల చైత్ర వనిగ మిగలాలని ఉంది నాకు..!
నీ అల్లరి పనులు చూసి నన్ను నేను మరిచేనే..!
నీ వలపుల ఆచేనును కాచాలని ఉంది నాకు..!
ఏకాంతములోన నిన్ను చూస్తున్నా నాలోనే..
నేను మాయమవటమే తెలియాలని ఉంది నాకు..!
ఏ తారకు మనసులోన ఏముందో ఓ చెలియా..?!
తెలుసుకునే దారి నువ్వు చూపాలని ఉంది నాకు..!
నీ ప్రేమకు దాసుడైన వానికేల మరణమింక..?!
అక్షరమా నీ సన్నిధి ఆగాలని ఉంది నాకు..!
చినుకు చినుకు మేలిముసుగు తొలగించే ప్రియతమా..!
నీ ప్రేమకు ప్రతిరూపం కావాలని ఉంది నాకు..!
ఏ గాలికి ఏ మేఘం ఏ దిశగా సాగేనో..!
ప్రతి మేఘపు ఆశయాలు తీరాలని ఉంది నాకు..!
ఎంత మధువు కురిసేవో జుర్రుకునే తపనే కద..!
నే వెర్రిని అయినందుకె..అడగాలని ఉంది నాకు..!
విచ్చేసే మన్మథలో నీజతలో తియ్యదనం..
మౌనంగా నీ చెవిలో పలుకాలని ఉంది నాకు..!
వసంత సుమ హాసాలకు పరిమళాలు నింపేవే..
నా తలపుల జలధి నిన్ను ముంచాలని ఉంది నాకు..!
ఎంత కొంటె కోణంగివి..చాటునుండి నవ్వుతావె..!
విరితావిగ నిన్ను చూస్తు ఉండాలని ఉంది నాకు..!
కన్నెవయసు పరదాలకు సరదాలను నేరిపేవె..!
బావా నీ కన్నులలో కులకాలని ఉంది నాకు..!
ఆ తారల వెలుగులన్నిఅక్షతలై కురియు వేళ..
నీ జతలో ఏడడుగులు వేయాలని ఉంది నాకు..!
మరపు రాని నీ చూపుల మధు ధారల కవ్వింతల..
వింతగొలుపు ఆ హాయిని పంచాలని ఉంది నాకు..!
మావి చిగురు మనసెరిగిన మహరాణివి నీవు కదా..!
నీ వలపుల చిగురులలో ఒదగాలని ఉంది నాకు..!
గులాబీల పరిమళమై ఎదనిండిన ఓ చెలియా..!
నీ ప్రేమకు నవాబుగా ఎదగాలని ఉంది నాకు..!
రేయిపవలు తేడాలిక మన నడుమన మిగలలేవు..!
నా సకలం నీలోనే కరగాలని ఉంది నాకు..!
పారిజాత సుమ రాణికి జాతకమే వ్రాసావే..!
నీ సన్నిధిలోని హాయి దాచాలని ఉంది నాకు..!
ఓటమసలు లేదన్నది తెలిపినావే ఓ చెలియా..
నీ చెలిమికి ఓ సాక్షిగ మిగలాలని ఉంది నాకు..!
ఈ జగాన సాగు క్రీడ సాక్షులమిక మనమేగా..
నీ మనస్సు కోవెలలో దాగాలని ఉంది నాకు..!
నిదుర పిలుపు వినపడదే నీ తలపుల మునిగినంత..
నీ చలాకితనమంతా త్రాగాలని ఉంది నాకు..!
మాటలసలు లేవు కదా..నిను పొగడగ ఓ చెలియా..
అక్షరాల వెన్నెల నిను తడపాలని ఉంది నాకు..!
ఏ కమలం విరిసిందో నీ దయతో నా లోలో..
నీ ప్రేమకు జ్ఞాపికగా వెలగాలని ఉంది నాకు..!

