నా మనసు
నా మనసు
పదునాల్గు లోకాలు తిరిగింది నా మనసు
ప్రేమదేవతకొరకు వెదికింది నామనసు
కన్నియకు దాసిగా జాబిల్లి సరిపోదు
వెన్నెల్లపుంతలో మునిగింది నా మనసు
మెరుపులా కనిపించి మాయమై పోయింది
చినదాని రూపునే వలచింది నా మనసు
వల వేయడానికే వచ్చింది కాబోలు
మాయతో పట్టేసి అడిగింది నా మనసు
కన్నీటిమబ్బులకు దూరమైపోయింది
పన్నీటిజల్లులో తడిసింది నామనసు
ఎన్నడూ తన వలపు దూరమై పోరాదు
ఆలోచనలతోటి వణికింది నా మనసు
చెలి మనసుతో సంగమించాలి
పంచకళ్యాణిలా ఉరికింది నా మనసు

