మళ్ళీ వద్దు
మళ్ళీ వద్దు
రాత్రి వెలిగించుకున్న దీపాలన్నీ గాలికి రాలిపోయాయి...
పొద్దున్నే ఎవరో వీధినంతా ఊడ్చేస్తూ వెళ్తుంటే మరీ ఒంటరైపోయా
మరీ చీకటైపోయా- అదే రాత్రి కన్నీటి బిందువుకు దేహమై వేలాడి
ఆడి ఆడి పడిపోయినప్పుడు తెగిన జలపాతంలా తెలీని అగాధంలోకి
మునివేళ్ళ మీద పెదాలు పూయించిన దేహాకాశాన్ని పరవశిస్తూ కాలిన
క్షణంలా రాలిపోయాక...
స్మృతికీ గతికీ మధ్య చితికిపోయి..'చితి'కి పోతూ... ఇంకిప్పుడు
చేయందించడానికీ ఎవరున్నారని? అయినా...
లోతెంతో తెలుసుకోవాలని తహతహలాడుతున్నవాడికి ఎవరో
అందించే చేయితో ఏం పని మళ్ళీ కలవాలన్న ఆశ కూడా లేదు
అసలు ఏదీ కూడా 'మళ్ళీ' చేయాలని లేదు...

