మల్లె మనసు
మల్లె మనసు
గుండెతడిని మోయలేక..మూల్గుతోంది మల్లెమనసు..!
తొలిరాతిరి వేడుకటా..నవ్వుతోంది మల్లెమనసు..!
ఏది తప్పు ఏది ఒప్పు..సమాధాన మిత్తురెవరు..
ప్రేమ అంటే ఏమిటని..అడుగుతోంది మల్లెమనసు..!
గుడికి కాని జడకు కాని..ఏ తేడా తలపోయదె..
అసలుచెలిమికి గీతమై..మిగులుతోంది మల్లెమనసు..!
సుడిగాలికి బెదిరిపోదు..తుఫానులకు భీతిల్లదు..
దండలోని దారమంటి..నలుగుతోంది మల్లెమనసు..!
ఖేదమైన మోదమైన..పెదవిచాటు నిలుపవలెగా..
రెప్పలంటని కనులతో..మరుగుతోంది మల్లెమనసు..!
మాట వినే నాధుడెవరు..చిన్నిలేత మొగ్గ ఘోష..
జాలిలేని జగతి నడుమ..వాడుతోంది మల్లెమనసు..!

