మేము
మేము
మేము రాలిపోతున్న ఎండుటాకులం
శిశిరానికి సలాం చేస్తూ
వసంతానికి తన ఆనవాళ్లను మొలిపించేందుకు
ఎండిన సీతాకోకచిలుకల్లా రాలిపోతున్నాం...
ఎండకు నీటికి ప్రాణం పోసుకున్నాం
ఋతువులకు స్వాగతం పలుకుతూ
రేపటి స్వప్నాల వికసిస్తున్నాం
కారడివి కట్టెల ప్రాణం పోయాలని ఆశతో...
ఏ గాలి వీచకున్న కొమ్మలను వీడుతూ
సుడులు తిరుగుతూ నేల తల్లిని ముద్దాడాం
ఆయువు ఉన్న పచ్చగా జీవించి
మరణించాక నేలకు బలం చేకూర్చాం..
సూర్యుడు మాపై వాలినప్పుడు చిరునవ్వే
గాలి మమ్మల్ని ఊపినప్పుడు అదొక ఆనందం
చెట్టుకు అతికించిన పత్ర హరితలం
ప్రతి కొమ్మకు అంటుకున్న నక్షత్రాల సొగసులం..
వర్షపు నీటితో తలస్నానం చేస్తూ పులకిస్తాం
నీటి బిందువుకు ముత్యపు ఆకారం పోస్తాం
మాలో కొలతలు తేడాలు ఉండొచ్చు
మేమంతా లోక కళ్యాణానికి పనికొస్తాం...
చెట్టు అనే ఆకాశానికి తగులుకున్న నక్షత్రాలం
రేయింబవళ్ళు వికసించే అరుణ తోరణాలం
భూమాత పండుగకు మొలిచిన ఆభరణాలం
పచ్చని ప్రకృతికి పరవశించిన ముత్యాలం...
సృష్టిలో పుట్టడం గిట్టడం సహజం
మా ఆయుష్షు శిశిరం ముగించి వేస్తుంది
మరో వసంతం మాకు ప్రాణం పోస్తుంది
జన్మరాహిత్యం బోధపడింది చాలా సంతోషం..
