మధురముగా
మధురముగా
మదురముగనాలోన..నవ్వుతూ ఉంటావు..!
నిజమౌన శక్తిగా..వెలుగుతూ ఉంటావు..!
ఈమాయ దాటించు..వేదాంత దీపమా..
నాహృదికి పరవశం..నింపుతూ ఉంటావు..!
రాగాల కోకిలగ..ఉన్నదీ మానసం..
నా జన్మ గంధాలు..రాల్చుతూ ఉంటావు..!
ఎదచాటు ఊహలకు..రెక్కలే మొలిచేను..
నా ధ్యాస వీణియను..మీటుతూ ఉంటావు..!
శతకోటి రూపాల..చైతన్య మూలమా..
నను సకల భువనాలు..త్రిప్పుతూ ఉంటావు..!
నీ దివ్య నాట్యమది..జరిగేను శ్వాసింట..
నీ చెలిమి సాక్షిగా..చూపుతూ ఉంటావు..!

