లోగిట్లో లోకం (15.9.2019)
లోగిట్లో లోకం (15.9.2019)
ప్రపంచం మనచేతుల్లో
నిక్షిప్తమై వుందనుకోకు...!
యుగాల్ని క్షణాల్లా
కాలాన్ని కరిగిస్తూ...
దూరపు కొండల్ని
దగ్గరగా చేస్తూ....
మనుష్యులెక్కడో వున్నా
కళ్లెదుటే అగుపిస్తూ...
పక్కనున్నవారు కాదని
ఎక్కడి వారితోనో మాట్లాడిస్తూ...
కాలు కదపకుండా
కార్యాలు నెరవేరుస్తూ...
మహిమలెన్నో చూపించి
నీ మనసుని మాయాజాలమై
ఆవరించింది అంతర్జాలం...!
మనిషి మమకారం మరుగై
ప్రేమ నశించక ముందే
కొంతైనా తేరుకుందాం
అతిగా అల్లుకుపోకుండా
మితంగా వాడుకుందాం
పండగకైనా పబ్బానికైనా
సొంతూరికొచ్చి సంబరపడదాం
మునిపటిలా మాట్లాడుకుందాం
ఇంటిల్లిపాదీ కలుసుకుందాం
లోగిట్లోనే లోకాన్ని చూద్దాం...!!