కనురెప్పల చప్పుడు
కనురెప్పల చప్పుడు
ఏదో తెలియని నిశ్శబ్దం
నా హృదయపు తలుపును
తట్టి లేపుతున్న భావన...
ఆ నిశ్శబ్దం ఎలా ఉందంటే...
సముద్రగర్భంలో
అగ్ని పర్వత విస్ఫోటనం
నిప్పులు కక్కుతూ,
సలసల కాగుతున్న లావా
ఉవ్వెత్తున ఎగసి పడుతుంటే...
ఆకాశాన్ని తాకే ఆ అలల వేడి సెగలు
నా మనసుకు తాకుతున్నాయి...
కానీ ఆ భయంకర శబ్దాలు
నా చెవులను చేరటం లేదు...
ఆనందంతో ఉరకలు వేస్తూ,
లేడి పిల్లలా గంతులు వేస్తూ,
గల గలా పారే గోదావరీ నదిలా,
నా నర నరాలలో ప్రవహించే
ఆ శ్రావ్యమైన రుధిర గీతం ఈ క్షణం
నా చెవులకు వినిపించటం లేదు...
నీ కోసం కొట్టుకునే
నా హృదయపు చప్పుడూ
నా మీద అలిగినట్టుంది...
గుట్టు చప్పుడు కాకుండా
తన పని తాను చేసుకుంటుంది...
గాలికి కదులుతున్న
నా పుస్తకంలోని పేజీలు,
వేగంగా తిరుగుతున్న
ఫ్యాన్ రెక్కల శబ్దాన్ని
తెలియజేస్తున్నాయి...
ఈ నిశ్శబ్దపు ఆవరణలో,
నా ప్రపంచమంతా
స్తంభించినట్టు తోస్తుంటే,
మనసు మూగగా రోధిస్తోంది...
కానీ ఇంతలో
సుదూర ప్రాంతాల నుండి
సుగంధాలు మోసుకొచ్చినట్టు,
ఎక్కణ్నుంచో 'నీ పిలుపును'
గాలి నాకోసం తీసుకొచ్చింది...
ఇక విస్ఫోటన శబ్దమే వినిపించని
ఆ నిశ్శబ్దం మాయమై,
'నా కనురెప్పల చప్పుడే
ఒక మహా విన్ఫోటనమై వినిపించింది...

