కన్నీటి కడలి
కన్నీటి కడలి
చిమ్మ చీకట్లో దమ్మక్క పెళ్లి అన్నట్లు
కనుచూపు లేని చోట కదలికలు కష్టమే
కాళ్లు చేతులు తడుముకుంటూ వెళ్తే
ఏ కుండ బద్దలు కొడతామో
ఒకటో రెండో వెలుగు రేఖలు చీకటిని చప్పరిస్తుంటే
వెలుతురు పోసలు పట్టుకొని వెళ్లి లైట్ వేయొచ్చు
ఆశలు మిణుగురు పురుగుల్లా ఆకర్షితాలు
కలల వెలుగులు రాకున్నా కన్నీళ్ల కడలిని దాటిస్తాయి
నత్తల్లా ముందుకు కదిలినా
అడుగడుక్కు దీపంతలు వెలిగిస్తూ పోతే
బాటసారులకు దారి దీపాలైతాయి
పదిమంది నడిచే చోట మెరుగులు దిద్దుకుంటుంది బాట
కాలువలో మునిగిపోతాయని భయమున్నా
చిన్ని చిన్ని ఆశల కాగితప్పడవలు వేస్తుంటాం
సంబరపడతాం, చప్పట్లు కొడతాం
గెలుపు ఓటములను తీసుకుంటాం సమానంగా
కాగితపు పడవలు నేర్పిన గుణపాఠాలే
పడవలై, నౌకలై దాటిస్తున్నాయి నదులు, సముద్రాలను
వేదాల్లో అన్నీ ఉన్నాయని మనం ఊరుకోం
గోళ్లలా అపనమ్మకాల్ని కత్తిరించుకొని
ఆచరణ శాస్త్రంతో అంతరిక్షంలోకి వెళ్తాం
విజ్ఞాన విత్తనాల్ని లోకమంతటా నాటుతాం
అలాగని అన్నీ జయించామనుకుంటే అహం
కాల మహిమ కలిసి రాకుంటే
కంటికి కనిపించని వైరస్ లే కళ్ళు మూపిస్తాయి
దేవుడే అన్నీ చేస్తాడని కూర్చుంటే
ఉన్నచోటే ఉప్పు రాయిలా కరిగిపోతావు
