కలలు రాలిన రాత్రి
కలలు రాలిన రాత్రి
మోడువారిన మనసునడిగా ఇంత శూన్యం ఎందుకన్నది
కలలు రాలిన రాత్రినడిగా అంత పంతం ఏలనన్నది
ఎన్ని ఆశలు రాలిపోతే గాయమై నే మిగిలినానో
చివరి ఊహకు ఊపిరిడిగా మనసు మరణం తప్పదన్నది
నాది నాదను భ్రాంతివీడదు నాటకాలివి ఎన్నినాళ్ళో
రాలిపోయే పువ్వునడిగా జన్మకర్ధం ఏమిటన్నది
చివరి ఆశలు బతుకుతున్నా చితికి దారులు వెతుకుతున్నా
చెమ్మగిల్లే కన్నునడిగా చరమగీతం పాడకన్నది
ప్రశ్న నీదే బదులు నీదే నిజములెరుగని నింద నీదే
నిగ్గదీసే మనసు నడిగా నమ్మకానికి అర్ధమన్నది
పిలిచి పిలిచీ అలసిపోయెను బదులు రాదని తెలిసిపోయెను
మూగబోయిన గొంతు నడిగా తులసి తీర్థం పోయమన్నది
కలలనైనా నింగి నేలలు కలవవెప్పుడు నిజము సత్యా..
కలత తీరని గుండెనడిగా చివరి గమ్యం మృత్యువన్నది

