కాఫీ కప్పు
కాఫీ కప్పు
ఇంతవరకూ ఒకే కాఫీకప్పుగా
మసలిని మనం ..,
చెరి సగం కప్పు లమయ్యాక చెప్పేదేం ఉంది?
గత అనుభవాల, ఙ్ఞాపకాల కొలను ఎండిపోయాక
నీటనున్న చేపపిల్ల ఒంటరిదై ఒడ్డుకు చేరకుండా ఉంటుందా?
ఇరువురమూ కళాభిమానులమే!
ఏకళ గొప్పదంటే ఏం చెబుతాం?
ఇద్దరు పిల్లల్లో నీకెవరిష్టం?
అంటే అమ్మేం చెబుతుంది..?.
బతుకు సుడిగుండంలో
మాటలు చుక్కాని లా ఉండాలే తప్ప..,
పెనుగాలై విరుచుకు పడి ముంచేయకూడదు..!
నిశ్శబ్దం ఇద్దరి మధ్యా రాజ్యమేలి,
రోజులు గడుస్తున్న కొద్దీ,
ఎక్కడో ఒక తీయని ఙ్ఞాపకం!
నిదుర లేపి , అనురాగపు
మకరందాన్ని అందించినప్పుడు,
కాఫీ కప్పు ఇవ్వకూడదనుకున్న నేను,
తను చూడకుండా టేబుల్ మీద పెట్టి
వెనుతిరుగుతాను...
సగం కప్పు కాఫీ కలుపుకోవడం చాత కాదుగా మరి!
కాసేపటికి తొంగి చూసి ఖాళీ అయిన కప్పుతో
కడుపు నింపుకుంటాను....
కఠినత్వం నీ వల్ల కాదులే!
అని వెక్కిరిస్తుంది మనసు!
ఇప్పటివరకూ తీరిక లేని సమయాల్లో
గంట క్షణంలా గడిపిన రోజులేగా అన్నీ!
మరి ఇప్పుడో?
సగం,సగం కలిసి ఒకటిగా ఉన్నప్పుడే బాగుంటుంది.
కప్పైనా, జీవితమైనా!..
