కాంతి పూలు
కాంతి పూలు
శత్రువెవరొ నీ చేతికి..చిక్కిపోగ వదిలిచూడు..!
అహంకార చూడామణి..కాలిపోగ తరచిచూడు..!
దిక్కులేమి చూస్తావోయ్..దిక్కుమొక్కు నీకు నీవె..
ఎక్కే మెట్లు దిగే మెట్లు..నవ్విపొగ వెలిగిచూడు..!
కాషాయపు బందీగా..వేషాలేం వేస్తావట..
పగటి కపట నాటకాలు..మండిపోగ కదిలిచూడు..!
'నీవు-నేను' విడివిడిగా..ఆడుకున్న ఆటలెన్నొ..
నీలోపల ఉన్న నన్ను..చేరిపోగ మీటిచూడు..!
మాటకారి తనమేదో..పెట్టుబడిగ ఏం లాభం..
జన్మగుట్టు పట్టుకోగ..జరిగిపోగ ఆగిచూడు..!
నిత్య జ్ఞాన పీఠముంది..నీ మౌనపు కోవెలలో..
అక్షరాల కాంతిపూలు..పంచిపోగ పొంగిచూడు..!
