పోవటమే
పోవటమే
ఆగలేని తనం వలన..వేగలేక పోవటమే..!
జీవితాన్ని బహుమతిగా..చూడలేక పోవటమే..!
ఆరాటపు వెన్నెలతో..పోరాటమె చరిత్రగా..
నీ పాత్రల సాక్షిగాను..ఉండలేక పోవటమే..!
అందమైన జ్ఞాపకాల..జాతరలో జన్మలుగా..
నిజ శ్వాసల వనసీమన..నిలువలేక పోవటమే..!
నిందించే పనేమిటో..విమర్శింతు వెవరినంట..
తీర్పుచెప్పు లక్షణాన్ని..మానలేక పోవటమే..!
మనసుమించి బలిపీఠం..మరేంలేదు గమనిస్తే..
తిరుగులేని ఎఱుకగాను..బ్రతకలేక పోవటమే..!
కోపంతో మమేకమై..ఎగిరిపడే వేడుకలో..
సహనామృత వాహినిగా..మిగలలేక పోవటమే..!
