STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నాన్నే నా శిఖరం

నాన్నే నా శిఖరం

1 min
2



నా నాన్నే నాకు ఒక మేరు పర్వతం 
ఓ దివ్యత్వాన్ని పోలిన హిమ శిఖరం 
మేరు నగ ధీరుడి లాంటి మూర్తిమత్వం
నా జీవితాన్ని తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తిత్వం 

నా తొలి అడుగులో నాన్న చేయి ఒక ధైర్యం 
నా తొలి పలుకులో నా ఆశయానికి స్థైర్యం 
నా తొలి ఓటమిలో వెన్ను నిమిరిన ఓదార్పు 
నా తొలి విజయంలో అంతులేని తన ఆనందం 

ప్రతి రోజు నాన్న తన ఆకలిని మరిచిన వైనం 
నా ఆకాంక్షల ఆకలిని తీర్చిపెట్టిన అన్నం 
తన అలసటను నవ్వుతూ మింగిన నాన్న 
నా భవిష్యత్తుకు వెలుగులు నింపిన నాన్న 

నాన్న నాకు నిత్యం ఎండలో నీడనిచ్చే గొడుగు 
మేము వానలో తడవకుండా తానొక గూడు 
నాన్న బతుకు తుఫానులో కొండంత అండ
ఇంటిల్లిపాదిని కనురెప్పల కాపాడు నిండా 

పనిలో నాన్న చేతులకు కాసిన ఆ కాయలు 
అ కష్టంతో భవిష్యత్తుకు వేసిన పునాదులు 
తన నుదుటిపై కనిపించే చర్మం ముడతలు 
మా జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో గాధలు

నాన్న కోపంలో కూడా పైకి కనిపించని ప్రేమ 
తన మౌనంలో దాగిన తీయని మమకారం 
కఠినమైన మాటల వెనుక మరువని కనికరం 
ఊరికనే వెన్నలా కరిగే కమ్మని హృదయం

నాన్న ఏది ఏమైనా, తన కష్టనష్టాల మలుపు 
పిల్లల భవిష్యత్తు కోసమే త్యాగాల పిలుపు 
ఎలా బతికినా, తానొక మేరు నగ ధీరుడు 
మా బతుకును గెలిపించి, గెలిచిన వీరుడు


Rate this content
Log in

Similar telugu poem from Classics