ఇక్కడ ఏది శాశ్వతం?
ఇక్కడ ఏది శాశ్వతం?
అమ్మ గర్భంలో
ప్రాణం పోసుకున్నాను
నాన్న గుండెపై
నడక నేర్చుకున్నాను
అక్క చంకనెక్కి గుడికెళ్ళాను
అన్న వేలుపట్టి బడికెళ్ళాను
తమ్ముడికి లోకాన్ని చూపాను
చెల్లెలికి శోకాన్ని మాపాను
నిన్న మొన్నటి వరకు
అందరితో కలిసున్న నేను
నేడు ఒంటరిగా మిగిలిపోయాను
తల్లిదండ్రులతో తగువులు
అన్నదమ్ములతో తెగువలు
ఆడబిడ్డలతో గొడవలు
ఆస్తుల కోసం ఆరాటం
అస్తమానం పోరాటం
రాగద్వేషాలకు అంకితమైన
రోగదోషాల జీవితమా!
ఇక్కడ ఏది శాశ్వతం?
రచన : వెంకు సనాతని
