హృదయం ముడుతలు
హృదయం ముడుతలు
అప్పుడప్పుడు హృదయ సందూక తెరుస్తా
పాతవి కొత్తవి ముడులు, ముడుతలు విప్పి చూస్తా
కావాల్సింది దొరికేదాకా వెతకడం
మళ్లీ అన్ని సర్దడంలో జ్ఞాపకాల పునఃశ్చరణ
అందులో ఉన్నవన్నీ కొన్నాళ్లు బట్టి పట్టిన పద్యమౌతాయి
మతిమరుపు తుప్పు పట్టినప్పుడల్లా
హృదయ సందుక తెరుచుకుంటా
హృదయం బెడ్ రూమ్ లోకి వెళ్తే ఒక పెద్ద బీరువా
ఖజానా, దుస్తులు అన్ని అందులోనే
వంట గదిలో వెన్న ముద్ద, పోపుల పెట్టె, ఫ్రిజ్
నోట్లోకి చీమంత రాళ్లను కూడా రానివ్వని వంటకం
హృదయం రెండు చెవులు చేటలైతే
తెల్లారగానే ఇంట్లో, వాకిట్లో చీపురు కదలికలు
పిట్టల కిచకిచలు, పావురాల రెక్కల చప్పుడు
బాత్రూంలో నీళ్ల శబ్దం, కూనిరాగాలు
సెల్ ఫోన్ రింగ్ టోన్లు, టీవీలో సుప్రభాత గీతాలు
అన్నీ పలకరింతలే, పలవరింతలు కాదు
చిన్న హృదయాన్ని ఏలడానికి
వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఎక్స్
సామాజిక మాధ్యమాలు, పత్రికలు, చానళ్లు
ప్రయత్నిస్తున్నాయి పోటాపోటీగా
వంతుల వారీగా
లొంగిపోతే దాసోహమనిపించుకుంటాయి
అన్నిటిని మించి ప్రాణమైన ప్రాణులుంటాయి
మనుమలో, మనుమరాల్లో, అమ్మానాన్నలో
భార్యాభర్తలో ఎవరైతేనేమి
ఆ పిలుపులు గారాబం చేస్తాయి, కేకలేస్తాయి
అడుక్కుంటాయి, ఆదేశాలిస్తాయి
ఏం చేసినా హృదయం కొట్టుకుంటదటువైపే
సెల్ ఫోన్ ఫుల్ చార్జింగ్ పెట్టి ఆన్ లో ఉంచినట్లు
హృదయాన్ని ఎప్పుడూ తెరిచే ఉంచాలి
మృదుత్వాన్ని ఆహ్వానించాలన్నా
కర్కషత్వాన్ని ఎదుర్కోవాలన్నా
ఏం నిర్ణయం తీసుకోవాలన్నా
హృదయ స్పందనలు తప్పనిసరి
ఏదీ పట్టనట్లు
ముడుచుకొని మూలకు కూర్చుంటే
కుంచించుకుపోయి మరుగుజ్జులవుతాం
మనకిష్టం లేకుంటే హృదయం లేదంటాం కసిగా
ఆ హృదయ కంపనలు గమనించకుండానే
ఒకరిద్దరు మెచ్చేది కాదు
అందరు నచ్చేది కావాలి, అందరూ నచ్చేది కావాలి
వయసెంతైనా ముడుతలు పడంది కావాల

