STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

5  

Midhun babu

Classics Fantasy Others

గ్రంధాలయం

గ్రంధాలయం

2 mins
4



సన్నప్పుడంతా నాకు ఒకటే భాద
ఏమంటే మాకు బంధువులెవరూ లేరు
దగ్గరివాళ్ళు లేరు...అన్నీ కల్పించుకున్న బంధాలే...
ఎందుకంటే మా జేజప్పకు మా నాయన ఒక్కడే
వెనకా ముందూ ఎవరూ లేరు
మా నాయనకు నేను ఒక్కడినే
నాకూ ఎనకా ముందూ ఎవరూ లేరు
మా అమ్మకూడా వాళ్ళ అమ్మా నాయనలకు ఒక్కతే
ఇట్లా మాది ఒంటి సంసారము
ఆప్యాయంగా దగ్గరికి పిలిచి
అక్కున చేర్చుకున్నొళ్ళు లేరు ..

అదే ఎప్పుడూ భాదగా వుండేది నాకు
ముఖ్యంగా ఎండాకాలం శెలవుల్లో
శెలవుల్లో తోటి పిల్లలంతా 
మా తాతగారి ఊరికని,అవ్వగార్ల ఊరికని
మామగారి ఊరికని పోతాండ్రి
జతగాల్లంందరూ ఎవురి ఊర్లకు వాళ్ళు
పొయినంక ఒంటరిగా మిగిలిపోతాంటి ..
ఎండాకాలం వస్తే నీళ్ళులేని చెరువులా వుంటాంటి ...

ఒక్కడినే అయిపోవడంతో
దిక్కుతెలీక పోతాండ్య
ఆ దిక్కు తెలీని తనమే నన్ను
గ్రంథాలయానికి లాక్కుపోయింది
నా అయిదో క్లాసులోనే అంటే 1963లోనే
చిన్నపిల్లల గ్రంథాలయానికి పోతాంటి ...

అనంతపురంలో గ్రంథాలయము
మున్షిపల్ ఆఫీసు పక్కనే వుండ్య
ఇప్పటికీ ఆడే వుండాది
పెద్ద రాతికట్టడము ...ముందుభాగంలో వేదిక వుంది
లోపలికి పోతానే పెద్ద హాలు
దాని నిండా అలమారాలనిండా ఇంటికివ్వని పుస్తకాలు
దాంట్లోనుండి పోతే కుడివైపు ఇంకో పెద్దహాలు
దాంట్లొ ఇనపర్యాకుల్లో దండిగా మెంబర్లకు
ఇంటికిచ్చే పుస్తకాల దొంతర్లు
ఎడమవైపున సిన్న హాలులో సెక్రటరీ కూర్చుంటాండ్య
అందులోనే సిన్నపిల్లల సెక్ష నుండ్య
పైన మిద్దిపైన దినపత్రికల సెక్షనుండ్య ...

నా సిన్నప్పుడు సిన్న పిల్లల సెక్షనుకుపోయి
బొమ్మల రామాయణము, మహాభారతము
పంచతంత్రం కథలు, చందమామ, బాలమిత్ర
ఇష్టంగా సదువుతాంటి ...అవేకాక
సిన్నపిల్లల కథల పుస్తకాలు ఆడేకూసొని సదువుతాంటి
ఎండాకాలం శెలవులన్నీ అక్కడనే
పుస్తకాల ఊహల్లో తేలిపోతాంటి ...

అలా మొదలయిన అలవాటు
నేను డిగ్రీ సదవేకి వచ్చినా పోల్యా
లైబ్రరీలో మెంబరుగా చేరల్లంటే
అయిదురూపాయలు మెంబర్ షిప్ కట్టల్ల
ఆ అయిదురూపాయలు యాట్నించీ తెచ్చేది
నోరుమూసుకొని ఆడేకూసొని సదువుకుంటాంటి
ఆడే విష్ణుపురాణము సదివితి
ఆడే భవ్విషత్ పురాణము సదివితి
ఆడే బ్రహ్మసూత్రాలు. సదివితి
ఆడే పాత భారతి పత్రకలు కళ్ళకద్దుకొని సదివితి
ఇంక నేను సదవని నవల్లు. కవిత్వపుస్తకాలు లేకుండ్య

ఎట్లో 1971లో మా పోలీసు నారాయణ మామ
మెంబరుగా సేరమని అయిదురూపాయలిచ్చె
ఏమి సంతోసంగా కడితినో 
అప్పటినుంచీ ఇంటికే పుస్తకాలు తెచ్చి సదువుతాంటి
ఆ మామకూడా నేను తెచ్చినపుస్తకాలు సదువుతాండ్య

అదే లైబ్రరీలో రాయలకళాగోష్టి 
అనే సంఘము స్థాపించి పెద్ద పెద్ద కవులు
కవిత్వాలు సదువుతాండ్రి, సాహిత్త ఉపన్యాసాలిస్తాండ్రి
ప్రతి సంవత్సరము నవంబరు 14 నుండి
వారంరోజులు గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతాండ్రి
ఆ వారం రోజులు బయటి ఊర్లనుంచీ
కవులు, రచయితలు వచ్చి ఉపన్యాసాలిస్తాండ్రి
ఆ వారంరోజులూ పండగున్నట్లుంటాడ్య నాకు ...

గ్రంథాలయ సెక్రటరీగా
అమ్మళ్ళదిన్నె గోపీనాథ్ ఉండ్య
ఫుల్ పంచి కట్టుకొని ,తెల్లజిబ్బా ఏసుకొని
పైన కండువా వేసుకొని నుదుట ఎర్రనామంతోవుంటాండ...
ఆయన శానా గొప్ప ఉపన్యాసకుడు
ఆయప్పది శానా సిత్రమయిన గొంతు
ఆయప్ప నోట్లో జానపదము పలికితేశానాబాగుంటాండ్య
అప్పట్లో ఏ సభకైనా ప్రారంభము వందన సమర్పణ
ఆయనె నేర్పుగా చేస్తాండ్య
ఆయన ఉపన్యాసంలో హాస్యరసం తొణికిసలాడుతాండ్య
ఆయన మంచి జానపద పాటగాడుకూడా
పొద్దన్నెలేసినాడు ఖాదరయ్య అనే పాట పాడితే
జనాలు ఊగిపోతాండ్రి 
ఇంతాజేసి ఆయప్ప మా నాయన క్లాసుమేటంట
అది శానా ముచ్చటగా వుండ్య నాకు...

అదే రాయలకళాగోష్టి ప్రాంగణంలో
ఆశావాది ప్రకాశరావు సారు
మాలాంటి యువ కవులనందరిని కలిపి
వారం వారం కవిసమ్మెళనాలు జరుపుతాండ్య
నేను యాడ సిన్నప్పటినుంచి పుస్తకాలు సదువుతాంటినో ఆడనే నేను కూడా
కవిసమ్మెళనాలలో కవిత్వం సదవడం అబ్బురంగావుండ్య...

ఆ రోజుల్లోనే మిత్రులంతా కలిసి
లిటరరీ మీట్ అని పేరు పెట్టి
ప్తతి ఆదివారం గిల్డప్ సర్వీసు స్కూలులోనో
కృష్ణకళామందిరంలోనో కలుస్తాంటిమి
రాచపాళెం ఛంద్రశేఖర రెడ్డి సారు
యస్.నారాయణ సారు ,బండి నారాయణ స్వామి
దేవపుత్ర, వై. శ్రీరాములు, మల్లెల నరసింహముర్తి
రాయుడు, బోస్, పద్మనాభయ్య, దక్షిణామూర్తి
కార్తికేయ శర్మ, బద్వెలి రమేశ్, యు.వెకటేశ్వర్లు
జుపల్లె ప్రేమ్ చంద్,గోవాడ రఘురాం కుమార్, నేనూ కలుస్తాంటిమి
ప్రతివారమూ కథమీదనో నవలమీదనో
కవిత్వంమీదనో ,యాదో ఒక అంశంపై చర్చిస్తాంటిమి

ఈ గ్రంథాలయానికి పోయే అలవాటు 
డిగ్రీలో స్టడీసెంటరుకు లాక్కుపోయింది
యం.ఏ. చదివేటప్పుడు పీ.జీ.గ్రంథాలయానికి. దారితీసింది ...
నేను ఎప్పుడూ వుంటే ఇంట్లో లేకుంటే
గ్రంథాలయంలో వుంటాంటి ...

పుస్తకాలే నా మొదటి మిత్రులు
నేను పుస్తకాలతో మాట్లాడినాను
పుస్తకాలతోనే ఏడ్చుకున్నాను
పుస్తకాలతోనే ఆనందపడినాను 
పుస్తకాలతోనే జీవితాన్ని దిద్దుకున్నాను ...

ఇప్పుడూ నా పెండ్లాము పుస్తకాలకు దుమ్ముకొట్టల్యాక
ఒంటిమీద నాలుగు తులాల బంగారం లేదుగానీ
కొంపనిండా యాడజూసినా పుస్తకాలేనని...కొట్లాడతాది 
ఆయమ్మకెట్ల సెప్పల్లప్పా
పుస్తకాలే బంగారమని ...వజ్ర వైడూర్యాలని ...
ఇంతాజేసి నా పెండ్లాము పేరు భారతి ....



Rate this content
Log in

Similar telugu poem from Classics