గిరిధారి
గిరిధారి
కందములు //
సరసిజలోచను డాహరి
కరుణారసధార చిల్కి కాపాడు ధరన్
బరమాత్మా!యని పిల్చిన
పరుగున దరిచేరి భక్త వరులన్ బ్రోచున్//
క్షేమమొసంగును హరియని
నీమముగా సేవ సల్పి నిష్ఠగ మెలగన్
గామిత వరదుండు జనుల
తామస గుణములను గాల్చి దయతో గాచున్//
'హరిహరి!'నీవే దిక్కని
కరిరాజు పిలువగ వచ్చి కాపాడి వెసన్
మురిపెముగా దరి చేర్చుచు
వరములొసంగు హరి భక్త వరదుండు సుమా!//
నమ్మిన వారిని వీడక
నెమ్మిని జూపు గిరిధారి నెయ్యుడు భువికిన్
సొమ్ములఁ గాచెడి విభుడట
నెమ్మిలి పింఛము ధరించి నిల్చెను ధరలో.//
కావఁగ గోపచయంబును
గోవర్ధనగిరిని పట్టి గోవిందుడు తా
నా వేలిపైన నిలపగ
బావనమూర్తిని పొగడిరి భక్తిగ జనులున్ //
