శివ స్తుతి
శివ స్తుతి
శివరాత్రి పర్వదినము...
తపస్వి మనోహరం e-book కొఱకు రచన.
తేది :16-02-2023
1.
దివిజుల్ సేయగ బూజలీ దినమునన్ దీపించ నీ శోభలున్
శివ రాత్రిన్ బలు సేవలన్ జరిపి నిన్ జిత్తంబులో నిల్పి నే
నివసింతున్ బద సన్నిధిన్ బ్రణతితో నిండార కీర్తించుచున్
భవ!కైవల్య పథంబు జూపగదె నా ప్రారబ్ధముల్ ద్రుంచుచున్.//
2.
సురలున్ యోగులు భూత యక్ష గణముల్ స్తోత్రంబులన్ జేయుచున్
వరముల్ గోరుచు నీదు దర్శనము సంప్రాప్తించ తోషంబుగన్
బరమాత్మా!యని భక్తితో పొగడి నీ పాదంబులన్ గొల్తురా
చరితంబంతయు వింటినయ్య!శివ!నీ సాయుజ్యమున్ గోరుచున్.//
3.
వరదా!కావగ రావ!యంచు వినతిన్ బ్రార్థించగా భక్తులున్
బరువుల్ బెట్టుచు వచ్చి నిల్తువట నీ వాత్సల్యమున్ జూపుచున్
గరళంబీయగ మ్రింగినావట కదా!కారుణ్య వారాశివే!
తరముల్ నిల్చెడి నీదు లీల వినుచో తాపంబులే నాశమౌ //
4.
గిరిజా శంకర!గంగతోడ నభిషేకించంగ నేవేచితిన్
విరులున్ బత్రము లెన్నియో కలిపి సంప్రీతిన్ విభూషించగన్
దరువుల్ తప్పెట కాహళా ధ్వనులతో ధామంబుకున్ జేరితిన్
బరమేశా!కనుపించవయ్య!ముదముగా భక్త్త్యాత్మనై కొల్చెదన్ //
--------------------------
