రేడియో
రేడియో
తెలుగు వారి సంస్కృతి లోన వెలుగు జిమ్మి
జ్ఞాన సాధనంబుగ నాడు జగతి నేలె.
కథలు, కవితలు నాటక కావ్య సుధలు
కవి పరిచయంబులు ఘనమౌ గాన కళలు
చిన్న పెట్టెలో వినిపించ చిత్ర మాయె.
సూక్తి ముక్తావళి మదిని శుద్ధి చేయ
లలిత గీతాలు వినిపించి పలకరించు
గగన వాణిస్వరమపుడు కలకలనుచు
జనహృదయమును గెల్చెను సంతసముగ.
పాటలెన్నియో వినిపించి పలుకరించు
రేడియో లేనట్టి గృహమప్డు లేదు భువిని
మీట త్రిప్పిన చాలును మేలు కొలిపి
వీనులకు విందు కూర్చచు వేడ్క తెచ్చి
మదిని దోచిన రేడియో మహిని గెలిచి
నాటి తరమును మురిపించె నవ్య గతిని.
మరిచి పోలేని యట్లుండు మాట -మంతి
పాడి -పంటల విషయాలు పలుకుచుండి
వార్త లందించి భువిలోన వరలె నపుడు.
తంతి లేనట్టి రేడియో చెంతనుండి
మంచి మిత్రుని చందము మాట లాడు.
చిన్న పిల్లలనందరిన్ జేర పిలిచి
పాటలెన్నియో పాడించ పరవశముగ
విని తరించిరి జనులెల్ల వేడ్కతోడ.
నిరుటి ముచ్చట లన్నియు నేడు కరువు
బుల్లి తెర వచ్చి మ్రింగెనా పూర్వ నిధిని
మంచిమిత్రుడు మెల్లగా మరలి పోయి
జ్ఞాపకంబుగ మిగిలెనీ జగతి యందు.
