గాయలో
గాయలో
కలల మేడ కూలినపుడు కళ్ళకెన్ని గాయాలో
ఆశల తీరం చేరని అలలకెన్ని గాయాలో
మధురమైన ఊహలతో సుమబాలలు విచ్చునుకద
తేనెకొఱకు భ్రమరమొస్తె పూల కెన్ని గాయాలో
కాలుతున్న తరువుపైన పక్షులేవి వాలవుకద
రగిలిపోవు గుండెలోన ప్రేమకెన్ని గాయాలో
వేదనుందొ మోదముందొ పలికించే నాదంలో
మధురమైన స్వరలాసిక చరితకెన్ని గాయాలో..
అవగుణాల పాలకులకు ధర్మనిరతి శూన్యమేగ
ఓట్లువేసి గెలిపించిన ప్రజలకెన్ని గాయాలో
హృదయానికి విపత్తులే కలుగుతుంటె శాంతెక్కడ
ఆశలు రాలిన దారిన భవితకెన్ని గాయాలో..

