ఏమైనాయో
ఏమైనాయో
గడియకొకసారి గుండెను తాకిన చల్లని మాటలు ఏమైనాయో
వింటున్నప్పుడు మదిలో పొంగిన తేనెల వాకలు ఏమైనాయో
నిన్నూ నన్నూ ప్రేమదీవులకు చేర్చిన నావలు ఏమైనాయో
తూఫానులలో దిశలను మార్చిన ఆ తెరచాపలు ఏమైనాయో
జీవితమంతా కలిసుండాలని పట్టిన చేతిని వదిలివేసావు
అన్ని దిక్కులకు వినిపించేలా చేసిన బాసలు ఏమైనాయో
సరసంలో నీ వాలుజడ విసిరి మెడకు చుట్టడం గుర్తొస్తున్నది
పరిమళాలతో నను కవ్వించిన మల్లెల మూరలు ఏమైనాయో
ఒకో అక్షరం చదువుకున్నపుడు సోలింతలలో తేలిపోయాను
కలయిక కోసము కలవరపడుతూ రాసే లేఖలు ఏమైనాయో
రాత్రి పొడవునా చిమ్మచీకట్లు కన్నులలోనే కురిసిపోతాయి
లెక్కలేనన్ని స్వప్నచంద్రికలు కురిసిన సీమలు ఏమైనాయో
రోజుకోసారి పరిణయమంటూ వేసుకున్నాము
మనలో విరిసిన ప్రేమపూలతో కట్టిన మాలలు ఏమైనాయో
