ఎదురుచూపులు
ఎదురుచూపులు
ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో కలుస్తామనే ఆశతో,
ప్రతిక్షణాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ,
ఆశగా రేపటికోసం ఎదురుచూస్తూ కూర్చుంటే,
నిరీక్షణల ఆలోచనలతో, నిదురేరాని కనురెప్పల మాటున
నీవొకక్షణం పాటూ ఆవిష్కృతమై, మాయమవుతావు
బరువుగా నీ నులివెచ్చని ఊపిరులు నా ఎదను తాకుతూ ఉంటే,
నీ ముంగురులు నా కనురెప్పలతో ఆటలాడుతూ,
నా ఎదమీద నీ మునివేళ్ళ స్పర్శను అనుభవిస్తూ,
నా ఆలోచనలన్నీ నీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే,
మూసిన నా కనులలో నీ రూపాన్ని చెదిరిపోనివ్వకుండా
ఒడిసిపట్టుకుని, నాలో నిన్ను కలిపేసుకోడానికి
ప్రయత్నిస్తూ ఉంటే, కమ్మని కల చెదిరి
నీవొక అనుభూతివైనావని తలచుకుని బాధపడనా,
మూసిన నా కనులలో నీ రూపం స్థిరమైపోవడానికి
శాశ్వతంగా కనులు మూసుకొని నీ చెంత చేరనా,
నీవు నిజముగా నా చెంత ఉన్నావని భ్రమసి,
గాఢంగా హత్తుకుందామని కనులు తెరిచి చూసినవేళ,
ముసిముసి నవ్వులను దాచుకుంటూ ఆనందిస్తున్నావని
నా సంశయాన్ని చూసి, నా గుండెల్లో శాశ్వతమైనావని
సంబరపడుతూ ధవళవర్ణ కాంతులను చిమ్ముతూ
దేవదుందుభులు వెంటరాగా స్వర్గం చేరితివా,
నా వెచ్చని ఊపిరులను నీ ఎదపై పరిచి
నా హృదయస్పందనని నీలో లయం చేయాలనీ
ఈ లోకంలోని సర్వం విడిచి నీ వెంట నడవాలని,
ఎప్పటికైనా నిన్ను చేరాలనే లక్ష్యంతో, నీ ఆలోచనలతో
కాలం గడుపుతున్న నాకు, నీ పరిచయం ఒక అద్భుతం,
నీ ఆలోచనలు అపురూపం, నీ చల్లని చూపులు నాకు
శక్తినిచ్చి ముందుకు నడిపిస్తున్నసాధనాలు,
నీవొక అద్భుతానివి, నీ కౌగిలి నాకు అమృతప్రాయం,
నీ చెంతను చేరి స్వాంతన పొందేవరకు తప్పవు ఎదురుచూపులు,
అందుకే ఎదురుచూపులు కూడా మధురం.
రచన: పి.గోపాలకృష్ణ (ఫోన్:9398917754)

