దోమలబెడద
దోమలబెడద
దోమల బెడద
(తేటగీతి మాలిక )
మనుజ సంతతి కంటెనీ మశకజాతి
ముందు విలసిల్లి పుడమిలో పుట్టి యుండె
నాటి నుండియు దోమలు నేటి వరకు
ముఱికి యందున జోరుగా ముసురు కొనుచు
రోగముల్ వ్యాప్తి చేయగా లోకులెల్ల
భయము నొందుచు నిత్యము బ్రతుకుచుంద్రు!
దోమలన్ మట్టు పెట్టెడి దొరలు కలరె?
ముఱికి గుంటలన్ దొలగించ ముప్పు తప్పు
పాలకుల్ తమ నిర్లక్ష్యవైఖరినిట
చూపు చుండగా దోమల చుఱుకుతనము
పెరిగి పోవగా రోగముల్ పెరిగి పోయె!
ప్రజలు చైతన్య వంతులై పారిశుధ్య
పనులు చేయించ గోరుచు పట్టుబట్టి
ప్రభుత నడుగుచు నిలదీయ వలయు నిపుడు!
ఉద్యమంబుగ దోమల నుసురుదీసి
ప్రజలు పుష్టితో నారోగ్య వంతులయిన
బలము కల్గిన మనజాతి వర్థిలంగ
భవ్య పథమున దేశము పరుగులిడును.//
