దీపావళి
దీపావళి
లోనవెలుగు దీపకోటి..చూచుటయే దీపావళి..!
నిత్యదీప సుమరాశిగ..మిగులుటయే దీపావళి..!
హృదిని మించి పసిడివనం..లేదన్నది తెలిసిందా..
విశ్వప్రేమ పూలకాంతి..గ్రోలుటయే దీపావళి..!
ఈ మాయా జగతిలోన..రంగులెన్ని ఉంటేనేం..
రంగులేని నీనవ్వుగ..వెలుగుటయే దీపావళి..!
ఒక కణమున మహావిశ్వ..ముందంటే అర్థమేమి..
కోటికోట్ల తారకలతొ..కూడుటయే దీపావళి..!
మాటలేల తూగగలవు..ఆనందపు రుచినిచాట..
స్వచ్ఛమైన మౌనములో..బ్రతుకుటయే దీపావళి..!
ఆర్పలేని ఆరిపోని..దీపాలకు మూలమేదొ..
తెలిసిసరిగ ఎఱుకలోన..ఉండుటయే దీపావళి..
