" దారితప్పిన స్వాతంత్య్రం "
" దారితప్పిన స్వాతంత్య్రం "


- రాజేష్ ఖన్నా
================================
ఉరకలేసే ఉత్సాహంతో సంబరాల్ని తెచ్చినా
ఆనందంతో గంతులేసి అంబరాన్ని తాకొచ్చినా
త్రివర్ణ పథకాన్నెగరేసి హస్తాల్ని ఝుళిపించినా
స్వేచ్ఛాజీవులమనే గర్వంతో గల్లాలేగరేసినా
మారింది పాలకులే గానీ పరిస్థితులు కాదని
దారితప్పిన స్వాతంత్య్రం దరువేసి చెప్పినా
వినబడని అమాయకులారా కళ్ళైనా తెరవండి
చతికిలబడ్డ చట్టానికి సప్పుడురాని సంకెళ్ళేసి
నిలబడని నిజాయితిని నీటిగోడతో దాచేసి
అమాయకుల జీవితాన్ని నిలువునా దోచేసి
మార్పురానివ్వని అధికారులు బిచ్చమేత్తేసి
అడిగేవాడే లేడని తమ పరిధుల్ని చెరిపేసి
విచ్చలవిడిగా విలయతాండవం చేస్తుంటే
దారితప్పిన స్వాతంత్య్రం లేదనే నమ్మండి
అన్యాయానికి స్వేచ్ఛనిచ్చి అవినీతికి నీడనిచ్చి
దారిద్ర్యానికి పల్లకినేసి బానిసత్వానికి పందిరివేసి
బలహీనుడి పరిస్థితి మారదని ముద్రలువేసి
అభాగ్యుల అడుగులకు చట్టమనే సంకెళ్లేసి
వాంఛలకనుగుణంగా చేతివాటంకొద్ది వాడేసిన
మూర్ఖులచేతిలోని స్వాతంత్య్రం దారితప్పింది
కుల మతరహిత నవసమాజనిర్మానం మరిచి
దౌర్జన్యాల ముసుగుతెరల్ని విశ్వమంతా పరిచి
మనుషుల్ని పీక్కుతింటూ మాంసం నచ్చదని
పాపాలన్ని చేసి పావనజీవితంలో ఉన్నానని
చెప్పి, మనుషుల్ని మాయచేసేవాడికి దొరికిన
స్వాతంత్య్రం నిజంగానే దారితప్పింది
మనుషుల్ని నమ్మించి వాళ్ళ సమాధులమీదా
నిర్మించిన సౌధాల్లో పబ్బం గడుపుతూ
ప్రగల్బాల శృతిలో కొట్టుకుపోయేవాడికి
రంగుల రాజకీయాలతో రాక్షసంగా బ్రతికేవాడికి
అందిన స్వేచ్ఛ ముమ్మాటికీ దారితప్పింది
పడతి పక్కలో తప్పితే ప్రగతిలో పనికిరాదని
బడిలో పాఠాలు చెప్తేనేం భర్తమాటే వినాలని
గుడిలో దేవత ఐతేనేం ఇంట్లో బానిసనేనని
ఒడిలో సుఖం దిరికితేనేం ఆమె ఒళ్ళొట్టి మట్టేనని
దుర్మార్గంగా ఆలోచించే భర్తలకున్నా స్వేచ్ఛా
వాళ్ళని మార్చలేకా దారితప్పిపోయింది
*******సమాప్తం********