కాలం మారిపోతోంది
కాలం మారిపోతోంది
భగవంతుడా కాలం మారిపోతోంది, చుట్టూ ఉన్న జీవం మాడిపోతోంది
పల్లె చిక్కి మంచాబడుతోంది, పట్నం బలిసి ఆయాసపడుతోంది
చేప తాగాను నీరు లేకుండాబోతోంది, పిట్ట వాలను కొమ్మ లేకుండాబోతోంది
పశువు తిరుగను జాడ లేకుండాబోతోంది, చెట్టు మొలవను జాగ లేకుండాబోతోంది
చుట్టూ జీవం తల్లడిల్లతా ఉంటే, తరాలనాటి స్నేహం కన్నీరైపోతోంది
భగవంతుడా కాలం మారిపోతోంది, చుట్టూ ఉన్న జీవం మాడిపోతోంది
నువ్వు ఆడాడో కొండల్లో గుట్టల్లో ఉంటావు
నీ చుట్టూ ఉన్న పచ్చదనమే ప్రపంచమంతా ఉందనుకుంటావు
నిను చూడను వచ్చే జనాలమల్లే అందరూ గొప్పగా ఉన్నారనుకుంటావు
నీ అడవికి జరిగే రాజభోగాలే అన్నీ అడవులకు జరుగుతాయనుకుంటావు
ఆలా అనుకుంటే నువ్వు గవెర్నమెంట్ లెక్కల్ని చూసి ప్రజల సంతోషాన్ని కొలిసినట్టే
భగవంతుడా కాలం మారిపోతోంది, చుట్టూ ఉన్న జీవం మాడిపోతోంది
మా ఊరి పిచుకలు చిన్ననాటి నేస్తాలు, పక్కూరిలో చూస్తే నాకు భాద, మా ఊరిలో లేవే అని
మా అడవిలో కాసే ఈత పండ్లను, బయట డబ్బులిచ్చి కొనగలిగినా, సంతోషంగా తినగలనా
ఊరిలోని జీవాన్ని చంపేస్తూ శవంలా మారిపోతున్నామనిపిస్తోంది
ఎన్నో వేల తరాలు చుసిన గ్రామాలకి ఈ తరంతో నూరేళ్లు నిండుతోంది
తరాలనాటి ఆస్తి అంటే పొలమేనా ఊరు కాదా
చేత్తో చెలమలోడితే అమృతాన్నిచ్చిన నేల నేడు వందల అడుగుల గుణపాలకు చెలించకుండా ఉంది
భగవంతుడా కాలం మారిపోతోంది, చుట్టూ ఉన్న జీవం మాడిపోతోంది
అడవి జీవానికి దిక్కులేక, తాగను నీరు లేక ఊరిమీద పడుతోంటే
వచ్చాయని వాటిని చంపాలా, కారణమైన మనల్ని నరకాలా
ఈ పిచ్చి జనాలు సొంత ఆస్తుల్ని చూసినట్టుగా ఊరి ఆస్తుల్ని ఎప్పుడు చూస్తారు
ఈ వెర్రి ప్రభుత్వాలు ఓటేసే జీవినే కాకుండా చుట్టూ వుండే జీవాన్ని ఎప్పుడు చూస్తాయి
నా ఆకలి, నా చేయినే తింటే తీరుతుందా
భగవంతుడా కాలం మారిపోతోంది, చుట్టూ ఉన్న జీవం మాడిపోతోంది
అందరికి సమాన న్యాయం లేదు, నీకొక న్యాయం నాకొక న్యాయం
జనాల మాదిరి నీ దగ్గరకు రాలేని జీవాల వేదన కూడా విను
నీకోసం ఏది తెచ్చినా అది అడవినుంచే వచ్చిందని గుర్తుంచుకో
అడవుల రుచి మరిగిన జనాలు నీ ఇంటికి రాకముందే జాగ్రత్తపడు
జనాల్లోని వివక్షను కాదు ప్రభో, మన జాతికి జీవులపై ఉన్న వివక్షను చూడు
రేపటి రోజుకు ఒక తరం వుంది అది ఈరోజు కాపాడుకుంది ఆస్తిగా పొందాల్సివుంది