బందీగా ఉండనిమ్మ
బందీగా ఉండనిమ్మ
బందీగా ఉండనిమ్ము..కలకాదని చెప్పనిమ్ము..!
అల్లుకున్న తేనెమల్లె..నీవేనని చెప్పనిమ్ము..!
ప్రతిపదమొక హరివిల్లే..నీనవ్వుల గగనంలో..
నీ చూపుల వాహిని నా..గజలగునని చెప్పనిమ్ము..!
చిగురాకుల వగరుమాటు..తియ్యదనం పంచేవా..
నావిరహపు వనసీమన..కోకిలవని చెప్పనిమ్ము..!
చిత్రమేదొ జరుగుతోంది..నీ పిలుపే వినిపించగ..
ఎదలోయల గాయానికి..లేపనమని చెప్పనిమ్ము..!
సరిగమలకు లొంగనిదే..నీ తియ్యని ఆ మౌనం..
నా సమాధి మందిరమున..వినోదమని చెప్పనిమ్ము..!
ఈలవేయ జూచుగాలి..యుగాలుగా తోడున్నది..
నాలోలో యాతనలకు..ఇకసెలవని చెప్పనిమ్ము..!

