బాగుండును
బాగుండును
ఈ రాతిరి తెలవారక..ఉండిపోతె బాగుండును..!
ఇది కలో నిజమో ఇలా..నిలిచిపోతె బాగుండును..!
నాతోనే నేనున్నది..వేరెవరికి తెలియదుగా..
వీచుగాలి చుట్టేయక..అలిగిపోతె బాగుండును..!
కన్నులింటి దీపరాశి..నవ్వులెంత అద్భుతమో..
విరహమేమొ నన్నుచూసి..వేగిపోతె బాగుండును..!
గుండెచుట్టు అల్లుకున్న..తేనెనదుల పరుగు చూడు..
నీనవ్వుల వెన్నెలలో..కలిసిపోతె బాగుండును..!
నీ అల్లరి చూపులలో..తడిసేనా భావనమే..
నీ తియ్యని గజల్ విందు..పంచిపోతె బాగుండును..!
ఇంత ఆశ ఎందుకంటె..చెప్పలేవు మాటలేవి..
నీ శ్వాసలు మౌనంలో..చేరిపోతె బాగుండును..!

