అర్ధాంగి
అర్ధాంగి


ముక్కు మొహం ఎరుగకున్నా
మది మానసంబు తెలియకున్నా
తల్లిదండ్రుల మాట జవదాటక
పుట్టి పెరిగిన ఊరు వదిలి
అమ్మను వదిలి నాన్నను వదిలి
తోబుట్టువులను వదిలి
ఆత్మీయబంధాల నెన్నింటి నో వదిలి
తెలియని బంధాలు తెలుసుకుని మసలుతూ
జీవిత బంధం కాబోతున్న కొత్త బంధం తో
చిటికెన వ్రేలు పట్టి ఏడడుగులు నడిచి
అర్ధాంగిగా అర్హతను పొంది
కొత్త వాతావరణానికి తానె ఒదిగి
హక్కులు మరిచి బాధ్యతల విలువలేరిగి
సుక్క పొడుపుతో సూర్యోదయమై
పాలపాకేట్టుతో పని మొదలై
వాకిట్లో రంగవల్లులు దిద్ది
అభిరుచుల అమృతాన్ని వండి వడ్డించి
డోమేక్స్ తో తుడిచి
డిష్ వాష్ తో కడిగి
రిన్ సోప్ తో ఉతికి
ఇస్త్రీలతో మడిచి
అన్నీ తానవుతుంది
ఆకలిగొన్నవేళ అన్నమవుతుంది
లాలించే వేళ జోలపాటవుతుంది
గాయపడ్డ వేళ తల్లడిల్లేహృదయమవుతుంది
విద్యా బుద్ధులు చెప్పేవేళ గురువవుతుంది
అనారోగ్యం పాలైన వేళ
సేవలు చేసే సేవకి అవుతుంది
కోరికలీడేర్చే దేవతవుతుంది
దూషించినా...దండించినా
మౌనంగా భరిస్తుంది
కష్ట నష్టాల్లో తోడూ నీడగా నిలుస్తుంది
పొద్దంతా అష్టావధానాలు
శతావధానాలు అవలీలగా చేసి
ఎన్ని సుగుణాలున్నా
ఎంత సహనాన్ని కలిగి ఉన్నా
ఎవ్వరిచేత కీర్తించబడదు.
అన్ని బంధాల గురించే తప్ప
తన స్వార్ధం ఆలోచించదు
అనామికగానే మిగిలి పోతుంది
అనవరతం శ్రమిస్తుంది
బ్రతికించే ప్రాణవాయువు కనిపించనట్లుగా
గుర్తించలేనివి అర్ధాంగి సేవలు