అప్పు -ఆపద
అప్పు -ఆపద
అప్పుచేయుచు తినుచుండి పప్పుకూడు
నాపదల్ చుట్టు ముట్టంగ నదిరిపడుచు
దీనులైనట్టి వారలన్ దేఱి చూచి
నప్పు చేయక బ్రతకండి!యాదరముగ.
హంగు నార్భాటములతోడ నతికి పోయి
గృహము గుల్లగ జేయుచు నహము పెరిగి
తెలివితేటలు మృగ్యమై తిరుగు వారు
బుద్ధిహీనులౌ చుందురీ పుడమియందు.
కొద్ది కొద్దిగా ధనమున్ గూడబెట్టి
లెక్కవేయుచు గడిపిన లేమి తరుగు.
వాహనంబులు సౌధముల్ వస్తుచయము
శాశ్వతంబులు కావని సర్దుకొనుచు
సజ్జనత్వమే ఘనమైన సంపదనుచు
తృప్తితోడ జీవనమును దీర్చి దిద్ది
పరుల కుపకారమున్ జేసి బ్రతికినపుడు
కోట్ల సంపదల్ మనయింట కురియుచుండు.
రాజులెందరో ధరణిలో రాజ్యమేలి
ధనపు మూటలన్ గైకొని జనుటలేదె?
ప్రాణ సమమైన బంధులన్ పత్ని సుతులఁ
మిత్ర గణమును విడనాడి మిత్తి వెంట
వెడలిపోవుట సత్యమౌ పృథ్వి వీడి.
దానధర్మములన్ జేసి దయను గూడి
యాశవీడుచు మనుజులు అణుకువ మెయిఁ
వేదవేత్తలు తెలిపిన విధిని తెలిసి
కాలమున్ బుద్ధి మంతులై గడుపవలయు.//
