అమ్మాయిని కాబట్టే..
అమ్మాయిని కాబట్టే..
పువ్వులoత సుకుమారంగా,
సీతాకోకచిలుక రెక్కలంత కోమలంగా..
తుషార బిందువులంత స్వచ్ఛంగా..
ఉండే ఒకే ఒక గొప్ప సృష్టి ఆడపిల్ల ట.
నాకది నిజమే అనిపిస్తుంది..
ఎందుకంటే..
మా నాన్నకి నేనే అమ్మని,
మా అమ్మకి ఇంచుమించు తోబుట్టువుని,
తమ్ముడికి రెండో అమ్మని,
తాతగారికి ఊత కర్రని,
అమ్మమ్మకి అలసటలో ఆటబొమ్మని,
రేపటి రోజున మరోకుటుంబం తో
మా కుటుంబ బంధానికి నేనే వారధి ని.
నా వాళ్ళకి కన్నీరొస్తే ..
నేను అ
ది తుడిచేందుకు ..
చూపుడువేలిని అవుతాను.
వాళ్ళ సంతోషంలో..
వాకిట వెలిగే దీపం అవుతాను.
కోపంతో ఎర్రబారిన రెప్పల మాటున
చల్లని కంటిపాపని అవుతాను.
కూతురిగా, కోడలిగా,
గృహిణిగా, ఉద్యోగినిగా..
తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా..
భార్యగా, బంధంగా..
అణువణువునా అందరికోసం తపిస్తాను..,
అందరి ప్రేమను ఆశిస్తాను.
అమ్మాయిని కాబట్టే..
అమ్మంత ప్రేమగా మరో ప్రాణికి ఆయువు పోస్తాను.
అవసరమైతే తన మనుగడకై నా ఆయువు బదులిస్తాను.